Thursday, 11 August 2011

రాజా బాటలో యువరాజా! జగన్ అరెస్టుకు ఆస్కారం


రాజా బాటలో యువరాజా!
జగన్ అరెస్టుకు ఆస్కారం

ఇక ఉక్కు దిగ్బందంలో కడప ఎంపీ..చార్జిషీలు తర్వాత కటకటాలు
మూకుమ్మడి దాడులకు రంగం సిద్ధం..వ్యూహచరనలో సీబీఐ
న్యూఢిల్లీ, హైదరాబాద్ : రాజా.. కనిమొళి! వైఎస్ జగన్ 'చూపిన' బాటలో పయనించారు. ప్రస్తుతం తీహార్ జైల్లో ఊచలు లెక్కిస్తున్నారు. తాజాగా.. రాజా, కనిమొళి 'వెళ్లిన' దారిలోనే జగన్ పయనం సాగుతోందా!? ఆయన కూడా జైలు ఊచలు లెక్కించక తప్పదా!? ఇందుకు 'ఔను' అనే అంటున్నారు న్యాయ నిపుణులు. జగన్‌పై క్రిమినల్ కేసు నమోదుకు సీబీఐ అన్ని ఆధారాలను సేకరించిన నేపథ్యంలో.. తొలి చార్జిషీటును దాఖలు చేయడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చని, దానిని దాఖలు చేసిన తర్వాత ఏ క్షణంలోనైనా జగన్‌ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

జగన్ అక్రమాస్తుల కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని హైకోర్టు ఇప్పటికే వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే, దర్యాప్తులో భాగంగా ప్రాథమిక ఆధారాలు సేకరించిన తర్వాత అరెస్టు చేయవచ్చని హైకోర్టు సీనియర్ న్యాయవాది బొజ్జా తారకం తెలిపారు. దర్యాప్తులో భాగంగా నిందితులను విచారించే హక్కు సీబీఐకి ఉంటుందన్నారు. విచారణ సందర్భంగా సీబీఐ కోరిన సమాచారాన్ని ఇవ్వకపోయిన, విచారణకు సహకరించకపోయిన అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయన్నారు. విచారణ క్రమంలో సంబంధిత రికార్డులను సీజ్ చేయవచ్చని తెలిపారు.

ప్రాథమిక అభియోగాలను నిర్థారిస్తూ చార్జిషీటు దాఖలు చేసిన తర్వాత సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశాలున్నందున నిందితులను అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ ఉంచుతారని 'ఆన్‌లైన్'కు తెలిపారు. ఈ క్రమంలోనే అక్రమ లావాదేవీలు జరిగిన సంస్థల బ్యాంక్ అకౌంట్లను స్తంభింప చేయాలని సీబీఐ కోర్టును కోరవచ్చని తెలిపారు. హైకోర్టుకే చెందిన మరో న్యాయవాది వి.రఘునాథ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విచారణలో భాగంగా అరెస్టు చేసే ప్రత్యేక అధికారాలు సీబీఐకి ఉంటాయని చెప్పారు. జగన్ కేసులో పెద్దఎత్తున అక్రమాలు చోటుచేసుకున్నాయనే అభియోగాలు వచ్చినందున సాక్ష్యాలను తారుమారు చేయకుండా ఉండేందుకు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు.

మళ్లీ సుప్రీంకు!?
హైకోర్టు తీర్పుపై సీబీఐ అధికారులు ఒకటి, రెండు రోజుల్లో సమావేశమై జగన్‌ను ఉక్కు చట్రంలో దిగ్బంధించేందుకు వ్యూహ రచన చేయనున్నట్లు సమాచారం. అదే సమయంలో, హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ జగన్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసేందుకు ఇప్పటికే సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు గత రెండు రోజులుగా జగన్ ప్రతినిధులు సుప్రీం న్యాయవాదులతో కీలక సమాలోచనలు జరిపారు. హైకోర్టు తీర్పు కాపీతో గురువారమే వారు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసే అవకాశాలు ఉన్నాయి.

కాగా, ప్రస్తుతం దేశంలో సంచలనం సృష్టిస్తున్న 2 జీ కుంభకోణం, కామన్‌వెల్త్ క్రీడల కుంభకోణం, నల్లధనం మొదలైన కేసుల్లో సుప్రీం వ్యాఖ్యలు, తీర్పుల నేపథ్యంలో హైకోర్టు తీర్పును జగన్ సవాలు చేసినా ఒరిగేది ఏమీ ఉండదని న్యాయ నిపుణులు తెలిపారు. చార్జిషీటు దాఖలైన తర్వాత ఏమైనా అభ్యంతరాలుంటే తమ వద్దకు రావచ్చని సుప్రీం చెప్పే అవకాశాలున్నాయి. అయితే, చార్జిషీటు దాఖలు చేసేందుకు అవసరమైన కీలక సమాచారాన్ని సీబీఐ ఇప్పటికే సిద్ధం చేసిందని, సీబీఐతోపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, కార్పొరే ట్ వ్యవహారాలకు చెందిన సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్, ఆదాయ పన్ను శాఖలు, ఇంటెలిజెన్స్ బ్యూరో పూర్తి స్థాయిలో రంగంలోకి దిగేందుకు సిద్ధమవుతున్నాయి.

హైదరాబాద్, కోల్‌కతా, బెంగళూరు నగరాల్లో కంపెనీలనే కాదు.. మారిషస్, దుబాయ్ కంపెనీలపైనా సీబీఐ దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. తమ దాడులను పకడ్బందీగా నిర్వహించేందుకు వివిధ శాఖలతో సంయుక్త దర్యాప్తు బృందం (ఎండీఐటీ)ని రూపొందించే విషయంపై ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనుంది. వాస్తవానికి, సీబీఐ దర్యాప్తులో అత్యంత కీలకమైన అంశం బినామీ కంపెనీలపై దృష్టి సారించడం.

దేశంలో విమానయాన రంగంతోపాటు అనేక భారీ ప్రాజెక్టులను నిర్వహిస్తున్న బడా కంపెనీలే రకరకాల బినామీ కంపెనీలను ఏర్పాటు చేయడం, సెల్ కంపెనీలను రంగంలోకి దించడం, తద్వారా జగన్ కంపెనీలకు నిధులు ప్రవహింపజేయడంపై సీబీఐ డేగకన్ను సారించింది. ఇలాంటి కనీసం 20 కేసులు సీబీఐ దృష్టికి వచ్చాయని, వాటి తీగ లాగితే బడా కంపెనీలు కూడా ఇరుక్కు పోతాయని విశ్వసనీయ వర్గాలు చెప్పాయి. అన్‌లిస్టెడ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన లిస్టెడ్ కంపెనీలపై సెబి ద్వారా దర్యాప్తు జరిపేందుకు కూడా అవకాశాలున్నాయి. జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టిన 56 కంపెనీల్లో పలు సంస్థలు బోగస్‌వని ఐటీ శాఖ ఇప్పటికే నిర్థారణకు వచ్చిది. అలాగే, సాక్షిలో విదేశీ పెట్టుబడులు ఫెమాను ఉల్లంఘించారనే ఆరోపణలపై ఈడీ దర్యాప్తు జరుపతోంది.

తీర్పు కాపీ అందాకే కేసు నమోదు: సీబీఐ
హైకోర్టు నుంచి తీర్పు కాపీ అందిన తర్వాతే కేసు నమోదు చేస్తామని సీబీఐ అధికారులు స్పష్టం చేశారు. వాస్తవానికి హైకోర్టు తీర్పు కాపీ ఇక్కడి నుంచి న్యూఢిల్లీలోని సీబీఐ డైరెక్టర్ జనరల్‌కు వెళుతుంది. దానిని ఆయన పరిశీలించిన తర్వాత కేసు నమోదు చేసి విచారణ జరిపే బాధ్యతలను తన కింది స్థాయి సిబ్బందికి అప్పగిస్తారు. ఈ క్రమంలో శుక్రవారం కేసు నమోదు కావచ్చని తెలుస్తోంది.

No comments:

Post a Comment