Saturday, 6 August 2011

మొబైల్‌తో మొండి రోగాలు


మొబైల్‌తో మొండి రోగాలు

తలనొప్పి, కళ్లు తిరగడం..
అకారణ కోపం వంటి సమస్యలు
ప్రత్యుత్పత్తి అవయవాలపైనా దుష్ప్రభావం
సెల్ టవర్ట పక్కన నివసించే వారికి కేన్సర్ ముప్పు
మనుషులకే కాదు...చెట్టుచేమలకూ ప్రమాదమే
రోజుకు మాట్లాడాల్సింది ఆరు నిమిషాలే!
లేదంటే ఆరోగ్యానికి ప్రమాదం: పరిశోధకుల హెచ్చరిక
ఫోన్ సంబాషణల కంటే..
ఎస్సెమ్మెస్‌లకే ప్రాధాన్యం ఇవ్వాలంటున్న నిపుణులు
సెల్‌ను కనీసం పదేళ్లు వాడితే గానీ దుష్పరిణామాలు బయటపడవ్
రజనీకి ఎప్పుడూ ఎటువంటి ఆరోగ్య సమస్య లేదు. ఈ మధ్య కాలంలో తరచూ విపరీతమైన తలనొప్పితో ఆమె బాధపడుతోంది. అప్పుడప్పుడూ కళ్లు తిరుగుతున్నాయని కూడా చెబు తోంది. చిన్న విషయాలకే కోపం రావటంవంటి లక్షణాలూ ఆమె లో కనిపిస్తున్నాయి. శారీరకంగా ఆమెకు ఎలాంటి సమస్య లేదని వైద్య పరీక్షలలో తేలింది. జీవన విధానంలో మార్పు అవసరమని డాక్టర్లు సూచించారు. పది, పదిహేను రోజులు ఆలోచించిన తర్వాత రజని సెల్‌ఫోన్ వాడటం మానేసింది. అలా కొన్నాళ్లు గడవగానే ఆమెను ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యలు ఒక్కొక్కటిగా మాయమవుతూ వస్తున్నాయి.

ఈ పరిస్థితి ఒక్క రజనికే పరిమితం కాదు. ఆధునిక జీవన శైలిలో భాగంగా సెల్‌ఫోన్‌కు అలవాటుపడ్డ అనేకులు ఇలాంటి వింత ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నారు. "సెల్‌ను చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడతాం. దానివల్ల మన ఆరోగ్యానికి వచ్చే సమస్యేమిటి? శాస్త్రవేత్తలు చిన్న విషయాలను కూడా పెద్దవిగా చేసి చూపిస్తూ ఉంటారు'' అని మీరు అనుకుంటూ ఉండొచ్చు. ఈ భావన నిజం కాదని పరిశోధకులు చెబుతున్నారు.

సెల్‌ఫోన్ల నుంచి వెలువడే విద్యుదయస్కాంత ధార్మికత (ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్) మానవ ఆరోగ్యాన్ని చెడగొడుతుందని వీరు హెచ్చరిస్తున్నారు. నిజానికి.. మనం ప్రతిరోజు ఉపయోగించే వాషింగ్ మెషీన్లు, ల్యాప్‌టాప్‌లు, మైక్రోవేవ్ ఓవెన్‌లు, వ్యాక్యూమ్ క్లీనర్లు వంటి పరికరాల నుంచి విద్యుదయస్కాంత ధార్మికత వెలువడుతూంటుంది. అయితే దీని పరిమాణం మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే స్థాయిలో ఉండదు. ఇదేరీతిలో సెల్‌ఫోన్ల నుంచి కూడా విద్యుదయస్కాంత తరంగాలు నిరంతరం వెలువడుతూ ఉంటాయి. మనం వాడే ఎలక్ట్రానిక్ గృహోపకరణాలతో పోల్చినప్పుడు సెల్‌ఫోన్ల నుంచి వెలువడే విద్యుదయస్కాంత ధార్మికత స్థాయి చాలా ఎక్కువ. ఫలితంగా మొబైల్ ఫోన్లు మన ఆరోగ్యంపై దుష్పరిణమాలకు కారణమవుతున్నాయన్నది పరిశోధకుల వాదన.

మానవ మెదడూ ఒక విద్యుత్ వలయమే
మానవ మెదడును ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్ (విద్యుత్ వలయం)తో పోల్చవచ్చు. బయట నుంచి వచ్చే రేడియేషన్ స్థాయి ఎక్కువగా ఉంటే.. ఈ సర్క్యూట్ దెబ్బతింటుంది. అందువల్ల మొబైల్స్‌ను ఉపయోగించవద్దని నిపుణులు సలహా ఇస్తున్నారని ఐఐటీ-బోంబే ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం ప్రొఫెసర్ గిరీశ్ కుమార్ వివరించారు. శాస్త్రవేత్తల లెక్కల ప్రకారం మైక్రోవేవ్ ఓవెన్ ఒక సెకనుకు 500 వాట్స్ రేడియేషన్‌ను విడుదల చేస్తుంది.

మొబైల్ ఫోన్ విషయానికి వస్తే అది ఒక సెకనుకు ఒక వాట్ రేడియేషన్‌ను విడుదల చేస్తుంది. అంటే 500 సెకన్లపాటు (దాదాపు తొమ్మిది నిమిషాలు) సెల్‌లో మాట్లాడితే మన మెదడును ఒక సెకనుపాటు మైక్రోవేవ్ ఓవెన్‌లో ఉంచినట్లు లెక్క. అంతేకాకుండా ఈ రేడియేషన్ చాలా ప్రమాదకరమైనది కూడా. "మనం ప్రతిరోజు అనేక రకాల రేడియేషన్ల వల్ల ప్రభావితమవుతూ ఉంటాం. ఉదాహరణకు సూర్యరశ్మిలో కూడా రేడియేషన్ ఉంటుంది.

అయితే అది మనల్ని చేరడానికి ముందు వాతావరణంలోని అనేక పొరలను దాటుకొని వస్తుంది. ఆ తర్వాత మన చర్మాన్ని తాకుతుంది. ఈ రేడియేషన్ నుంచి కాపాడుకోవటానికి శరీరం కొన్ని రక్షణ చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగానే చెమట పడుతుంది. కానీ మొబైల్, మైక్రోవేవ్ ఓవెన్ వంటి పరికరాల నుంచి వచ్చే రేడియేషన్ నేరుగా చర్మాన్ని దాటి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. మన దేహంలోని రక్తం వంటి ద్రవాలను అది వేడి చేస్తుంది. దీని వల్ల మన శరీరానికి కలిగే హాని ఎక్కువ. మన మెదడు మొత్తంలో 90 శాతం ద్రవాలు ఉంటాయి. రేడియేషన్ వల్ల అవన్నీ ప్రభావితం అవుతాయి.

ఇదే విధంగా మన చెవి తమ్మెలు, ప్రత్యుత్పత్తి అవయవాలలో ఉండే స్రావాలు కూడా రేడియేషన్ కారణంగా వేడెక్కుతాయి. మొబైల్‌ను 20 నిమిషాల పాటు చెవికి దగ్గరగా పెట్టుకొని మాట్లాడితే చెవి తమ్మెలలో ఒక డిగ్రీ వేడి పెరుగుతుందని పరిశోధనలలో వెల్లడైంది. కేవలం సెల్‌ఫోన్లు మాత్రమే కాకుండా సెల్ టవర్స్ వల్ల కూడా అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని పరిశోధనల్లో తేలింది. సెల్‌ఫోన్ టవర్లతో ఆరోగ్య సమస్యలకు ఉన్న సంబంధంపై ముంబై నగరంలోని విల్‌కాన్ టెక్నాలజీస్ అనే కంపెనీ పరిశోధనలు నిర్వహించింది.

సెల్‌ఫోన్ టవర్లు ఉన్న ప్రాంతాల్లో నివసించేవారికి కేన్సర్ వ్యాధి సోకే ప్రమాదం ఎక్కువని ఈ సంస్థ పరిశోధనల్లో వెల్లడైంది. "కేవలం మనుషులకే కాదు... క్రిమికీటకాలకు, మొక్కలకు కూడా సెల్ రేడియేషన్ ఎంతో హాని చేస్తోంది. సెల్‌ఫోన్ టవర్‌కు పక్కన ఉండే మొక్కకు పూలు పూసే శక్తి 95 శాతం తగ్గిపోతోంది. ఇక మనుషులకు ఈ టవర్లవల్ల కలిగే హాని గురంచి చెప్పాల్సిన అవసరం లేదు. కేన్సర్‌సహా అనేకరకాల వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. ముఖ్యంగా సెల్ టవర్ ఉన్న అపార్ట్‌మెంట్‌లలోని ఫ్లాట్లలో ఎక్కువ సమయం ఉండే పిల్లలు, మహిళలపై ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది'' అని విల్‌కాన్ టెక్నాలజీస్‌కు చెందిన నీహా కుమార్ అభిప్రాయపడుతున్నారు.

మన దేశంలో కొరవడ్డ ప్రామాణిక అధ్యయనాలు
వాస్తవానికి మొబైల్ ఫోన్లు వాడటం వల్ల కేన్సర్ వచ్చే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ లోగడ ప్రకటించినప్పుడు అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళనకు గురైంది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఫలితాలను తాము అంగీకరించబోమని ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) శాస్త్రవేత్తలు ఇటీవల పేర్కొన్నప్పుడు అంద రూ హమ్మయ్య! అంటూ ఊపిరి పీల్చుకున్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన అధ్యయనం వేర్వేరు పరిశోధనల క్రోడీకరణల ఫలితమని ఐసీఎంఆర్ వాదించింది. "మొబైల్ ఫోన్లు వాడటం వల్ల కేన్సర్ వస్తుందని మన దేశంలో నిర్వహిస్తున్న అధ్యయనంలో తేలితే దానిని మాత్రమే మేం విశ్వసిస్తాం'' అని ఐసీఎంఆర్ డైరక్టర్ డాక్టర్ వి.ఎం.కటోచ్ కూడా విస్పష్టంగా ప్రకటించారు. కానీ, మన దేశంలో మొబైల్ ఫోన్ల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలపై ప్రామాణిక అధ్యయనాలేవీ జరగటం లేదు. ఏడాది కిందట మూడు కోట్ల రూపాయల బడ్జెట్‌తో ఐసీఎంఆర్ ప్రారంభించిన అధ్యయనం కాగితాల దశను దాటలేదు.

అయితే ఆరోగ్య నిపుణులు మాత్రం మొబైల్ వల్ల కేన్సర్ వంటి దీర్ఘకాలిక రోగాలు రావడమే కాకుండా మొత్తం ఆరోగ్యమే దెబ్బతింటుందని హెచ్చరిస్తున్నారు. మొబైల్ ఫోన్లవల్ల కలిగే దుష్పరిమాణాలు వెల్లడవడానికి కనీసం ఎనిమిది నుంచి పదకొండేళ్ల వరకూ సమయం పడుతుందనేది నిపుణుల అంచనా. మన దేశంలో మొబైల్స్‌ను విరివిగా వాడటం 2003లో ప్రారంభమైందిది. ఈ లెక్కన చూస్తే మన దేశంలో సెల్‌ఫోన్ల వాడకం వల్ల కలిగే దుష్పరిణామాలు వచ్చే ఏడాది నుంచి బయటపడే అవకాశం ఉందని కొందరు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

రక్షణ చర్యలేమిటి?
ప్రస్తుత మన జీవన విధానంలో సెల్ రేడియేషన్ నుంచి తప్పించుకోవటం దాదాపు అసాధ్యం. అయితే దీనివల్ల ఎదురయ్యే దుష్పరిమాణాలను వీలైనంత వరకూ తగ్గించటానికి శాస్త్రవేత్తలు కొన్ని చర్యలు సూచిస్తున్నారు. వీటిలో స్పెసిఫిక్ ఎబ్‌జార్‌ప్షన్ రేటు (ఎస్ఏఆర్) ఒకటి. మన శరీర కండరాలు ఎంత రేడియేషన్‌ను తట్టుకోగలవో ఎస్ఏఆర్ సూచిస్తుంది. సెల్‌ఫోన్ ఉత్పత్తిదారులు, ప్రభుత్వం ఈ రేటును నిర్ణయిస్తాయి. అమెరికాలోని సెల్యులర్ టెలికమ్యూనికేషన్స్ అండ్ ఇంటర్నెట్ అసోసియేషన్ (ఐసీటీఐఏ) దీన్ని 1.6 వాట్- కేజీ టిష్యూగా నిర్ణయించింది.

ఇటీవల డబ్ల్యుహెచ్‌వో నివేదిక వచ్చా క మన ప్రభుత్వం కూడా ఇదే పరిమితిని మించకూడదని ఆదేశాలు జారీచేసింది. ఈ లెక్కన రోజూ ఆరు నిమిషాలకన్నా ఎక్కువసేపు మొబైల్‌లో మాట్లాడకూడదు. ఒకవేళ ఎస్ఏఆర్ రేటు 0.5 వాట్స్-కేజీ టిష్యూ ఉన్నా రోజుకు 20 నిమిషాలకు మించి మాట్లాడితే ఆరో గ్య సమస్యలు తప్పవు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఇది ఏ విధంగా నూ సాధ్యం కాదు కాబట్టి వీలైనంత వరకూ సెల్‌ఫోన్ సంభాషణను తగ్గించుకోవటం ఒక్కటే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ జాగ్రత్తలు పాటించండి!
- 1.6 వాట్స్-కేజీ టిష్యూ ఎస్ఏఆర్‌కన్నా తక్కువ ఉన్న మొబైల్‌ఫోన్లను మాత్రమే కొనుగోలు చేయండి
- సిగ్నల్స్ సరిగ్గా ఉన్నప్పుడే కాల్ చేయాలి.
- వీలైనంత వరకు ఎస్సెమ్మెస్‌లకే పరిమితం కావడం మంచిది.
- సెల్‌ను ఉపయోగించనప్పుడు శరీరానికి దూరంగా ఉంచాలి.
- ఫోన్‌ను నేరుగా చెవి దగ్గర పెట్టుకోకుండా ఇయర్ ఫోన్లు, బ్లూటూత్ వంటి పరికరాలను వాడటం మంచిది. ఇలా చేయ డం వల్ల కొన్ని సమస్యలకైనా దూరంగా ఉండవచ్చు.

No comments:

Post a Comment