Thursday 11 August 2011

జగన్, ఎమ్మార్‌లపై సీబీఐ దర్యాప్తు


జగతి కిలాడీలే
జగన్, ఎమ్మార్‌లపై సీబీఐ దర్యాప్తు
రాష్ట్ర హైకోర్టు సంచలన తీర్పు
జగన్‌పై క్రిమినల్ కేసు పెట్టండి

ఆయన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన వారందరిపై కూడా!
జగన్ అక్రమాస్తులకు ప్రాథమిక ఆధారులున్నాయి: ధర్మాసనం
ఎమ్మార్ అక్రమాలూ నిజం...పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశం
పూర్తిస్థాయి దర్యాప్తు చేయండి
వాస్తవాలు నిగ్గు తేల్చండి
సీబీఐకి హైకోర్టు ఆదేశం
అక్రమాలకు ప్రాథమిక ఆధారాలున్నాయ్
ఇటు 'మేళ్లు'..అటు పెట్టుబడులు వాస్తవం
ఐపీసీ, అవినీతి నిరోధక చట్టం
మనీ లాండరింగ్ చట్టాలను ఉల్లంఘించారు
కుట్రపూరిత చర్యలకు పాల్పడ్డారు
అసలు పెట్టుబడిదారులెవరో దర్యాప్తుతో స్పష్టం
పార్టీ అయినా, కాకున్నా అందరి పాత్రా తేలాల్సిందే
ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు..49 పేజీల తీర్పు
ప్రాథమిక విచారణ నివేదిక ఇచ్చేందుకు ససేమిరా
హైదరాబాద్, ఆగస్టు 10: న్యాయ కోవిదులు అంచనా వేసినట్లే జరిగింది. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, ఎంపీ జగన్మోహనరెడ్డిపై క్రిమినల్ కేసు నమోదుకు రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. జగన్ అక్రమాస్తులు, ఆయన గ్రూప్ సంస్థల్లో పెట్టుబడులపై పూర్తిస్థాయి సీబీఐ దర్యాప్తునకు ఉత్తర్వులిచ్చింది. జరిగిన అక్రమ లావాదేవీలు, దొడ్డిదారి పెట్టుబడులకు ప్రాథమిక ఆధారాలున్నాయంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.

మంత్రి శంకరరావు రాసిన లేఖ, టీడీపీ నేతలు ఎర్రన్నాయుడు, అశోక గజపతిరాజు, బైరెడ్డి రాజశేఖరరెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై చీఫ్ జస్టిస్ నిస్సార్ అహ్మద్ కక్రూ, జస్టిస్ విలాస్ వి.అఫ్జల్ పుర్కర్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం 49 పేజీల తీర్పును వెలువరించింది. న్యాయవాది కె.కె.షేర్వాణి దాఖలు చేసిన పిటిషన్‌లో సైతం, శంకరరావు, టీడీపీ నేతల పిటిషన్లలోని అంశాలే పూసగుచ్చినట్లు ఉన్నాయంటూ, ధర్మాసనం ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది.

జగన్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి, ఆయన సంస్థల లావాదేవీలపై చట్టప్రకారం దర్యాప్తు చేసి, వాటి నిగ్గు తేల్చాలని తన తీర్పులో ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. సీబీఐ ప్రాథమిక విచారణ నివేదిక ప్రతిని ఇవ్వాలన్న జగన్ తరఫు న్యాయవాది అభ్యర్థనను సైతం ధర్మాసనం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది. జగన్ సంస్థల్లో పెట్టుబడులపై క్రిమినల్ కేసు నమోదుకు ఆదేశించినందున, ఆ నివేదిక దర్యాప్తు అధికారుల వద్దే ఉంటుందని, అది బయటపెట్టజాలమని స్పష్టంచేసింది. అదీగాక, తాము ఆ నివేదికపై ఆధారపడి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది.

తమ ముందున్న సాక్ష్యాలు, వ్యాజ్యాలతో దాఖలు చేసిన ఆధారాలను బట్టే ఈ కేసులో ప్రాథమిక ఆధారాలున్నట్లు నిర్ధారణకు వచ్చి, పూర్తిస్థాయి దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు స్పష్టంచేసింది. సీబీఐ ప్రాథమిక విచారణ నివేదిక, ఇకపై కేసు డైరీలో ఒక భాగమవుతుంది కనుక దానిని బయటపెట్టడం కుదరదని తేల్చిచెప్పింది. ఆ నివేదికను ప్రతివాదులకు వ్యతిరేకంగా వాడుకున్న పక్షంలోనే సహజ న్యాయ సూత్రాల ప్రకారం వారికి అందజేయడమనే ప్రస్తావన వస్తుందని వ్యాఖ్యానించింది. అదీగాక సీబీఐ ప్రాథమిక నివేదికను బహిర్గతం చేస్తే... పూర్తిస్థాయి దర్యాప్తు కంటే ముందే ఆ నివేదికకు అనవసర మీడియా ప్రచారం లభించి, తమ క్లయింట్లు ప్రజల దృష్టిలో చులకనవుతారంటూ కొందరు ప్రతివాదుల తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తెచ్చిన విషయాన్ని ధర్మాసనం ఇక్కడ ప్రస్తావించింది. వారి అభిప్రాయాన్ని కూడా తాము పరిగణనలోకి తీసుకుంటున్నట్లు, ప్రాథమిక నివేదికను తిరిగి సీల్ చేసి ఉంచేస్తున్నట్లు తెలిపింది.

ఎన్నెన్నో ఆధారాలు!
వైఎస్ ప్రభుత్వ హయాంలో వివిధ రూపాల్లో మేళ్లు పొందిన సంస్థలు జగన్ గ్రూప్‌లో పెట్టుబడులు పెట్టిన తీరు, రకరకాల సంస్థల పేరిట అడ్డగోలుగా నిధుల ప్రవాహం సాగిన తీరుకు సంబంధించి... పిటిషన్లలో పేర్కొన్న వివరాలు, సమర్పించిన ఆధారాలను, కోర్టు సహాయకుడు పొందుపరచిన వివరాలను ధర్మాసనం తన తీర్పులో సవివరంగా ప్రస్తావించింది. ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన సంస్థలు, వ్యక్తులు.. జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు ప్రాథమికంగా తాము సంతృప్తి చెందినట్లు విస్పష్టంగా పేర్కొంది.

మొత్తంమీద ముందుగా ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది, పెట్టుబడులు పెట్టడం లేదా ముందుగా పెట్టుబడులు పెట్టి, తర్వాత ప్రభుత్వం నుంచి లబ్ధి పొందడం, ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగినట్లు హైకోర్టు ప్రాథమికంగా నిర్ధారించింది. ఐపీసీ, అవినీతి నిరోధక చట్టం, మనీ లాండరింగ్ నిరోధక చట్ట నిబంధనలను ఉల్లంఘించి, కుట్రపూరిత చర్యలకు ప్పాలడటం ద్వారా అక్రమ ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమికంగా స్పష్టమైందని పేర్కొంది. "స్థానిక, విదేశీ కంపెనీల నుంచి భారీ మొత్తంలో పెట్టుబడులు తరలివచ్చాయి. అందులో పలు పెట్టుబడులు పన్ను మినహాయింపులకు స్వర్గధామంగా ఉన్న దేశాల నుంచీ తరలి వచ్చాయి.

ఈ నేపథ్యంలో విస్తృత ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని, ఇటువంటి కేసులను ప్రత్యేక నైపుణ్యంతో డీల్ చేయగల ఒక విశ్వసనీయమైన స్వతంత్ర సంస్థతో దర్యాప్తు చేయవలసిన అవసరం ఉంది. అందుకు తగిన సంస్థ సీబీఐయేనన్నది మా అభిప్రాయం'' అని ధర్మాసనం తన తీర్పులో వ్యాఖ్యానించింది. ప్రస్తుత కేసులో పార్టీ అయినా, కాకపోయినా, జరిగిన లావాదేవీలలో ఆయా వ్యక్తులు, సంస్థల పూర్తి పాత్ర ఏమిటనేది పూర్తి స్థాయి దర్యాప్తు లేకుండా నిర్ధారించడం సాధ్యం కాదంటూ, తగిన విచారణ ద్వారానే అన్నీ తేలుతాయని స్పష్టంచేసింది.

పాపాల పుట్ట పగులుతోంది. నిజాల నిగ్గు తేలుతోంది. తండ్రీ కొడుకుల 'మేళ్ల' లింకు నిర్థారణ అవుతోంది. ఐదేళ్లపాటు రాష్ట్రంలో నిరాఘాటంగా సాగిన దోపిడీ పర్వం వెనుక సర్వం తెలిసివస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు సాగించిన అక్రమాల దందా అత్యున్నత న్యాయస్థానం సాక్షిగా ఆవిషృతమవుతోంది. వైఎస్ హయాంలో ఆయన తనయుడు జగన్ భారీగా అక్రమార్జనకు పాల్పడ్డారన్న ఆరోపణలను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం «ద్రువీకరించింది. జగన్ అక్రమాస్తులు, ఎమ్మార్ ప్రాపర్టీస్ కేసుల్లో బుధవారం సంచలన తీర్పులను వెలువరించింది.

"ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన సంస్థలు, వ్యక్తులు జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్లు ప్రాథమికంగా సంతృప్తి చెందాం. మొత్తంమీద.. ముందుగా ప్రభుత్వం నుంచి లబ్ధి పొంది పెట్టుబడులు పెట్టడం లేదా ముందుగా పెట్టుబడులు పెట్టి, తర్వాత ప్రభుత్వం నుంచి లబ్ధి పొందడం, ఈ రెండింటిలో ఏదో ఒకటి జరిగింది'' అని హైకోర్టు స్పష్టం చేసింది. స్థానిక, విదేశీ కంపెనీల నుంచి జగన్ కంపెనీల్లోకి పెట్టుబడులు వచ్చినట్లు తెలిపింది. ఐపీసీ, అవినీతి నిరోధక చట్టం, మనీ లాండరింగ్ నిరోధక చట్ట నిబంధనలను ఉల్లంఘించి, కుట్రపూరిత చర్యలకు ప్పాలడటం ద్వారా జగన్ అక్రమ ఆస్తులు కూడబెట్టారని ప్రాథమికంగా నిర్థారించింది.

జగన్ అక్రమాస్తులపై పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నిస్సార్ అహ్మద్ కక్రు, జస్టిస్ విలాస్ వి అఫ్జల్ పుర్కర్‌లతో కూడిన ధర్మాసనం సీబీఐని ఆదేశించింది. ఎమ్మార్ ప్రాపర్టీస్ అక్రమాల గుట్టునూ రాష్ట్ర హైకోర్టు నిర్థారించింది. అక్రమాలు నిజమేనని.. అవకతవకలు జరిగినట్టు తమ వద్ద ప్రాథమిక ఆధారాలున్నాయని తేల్చి చెప్పింది. ప్రజా ధనం దుర్వినియోగంపై కేసు నమోదు చేసి, దర్యాప్తు జరపాలని సీబీఐని ఆదేశించింది. "ప్రజా ధనాన్ని కాపాడడంలో రాష్ట్ర ప్రభుత్వం, ఏపీఐఐసీ ఘోరంగా విఫలమయ్యాయి. పలు రకాల తప్పులు, రికార్డుల తారుమారు, మోసం, అవకతవకలు, పన్నుల ఎగవేత, మనీ లాండరింగ్ ద్వారా విదేశాలకు డబ్బు తరలిపోయినా ఒక్క కేసు కూడా నమోదు చేయకుండా రాష్ట్ర యంత్రాంగం మౌన, ప్రేక్షకపాత్ర వహించింది'' అని మండిపడింది.

నేరపూరిత కుట్ర ద్వారా ఇంత పెద్దఎత్తున ప్రజాధనం లూటీ అయితే.. చూస్తూ ఉండలేమని, రాజ్యాంగ, చట్టపరమైన కర్తవ్యాలను నిర్వర్తించడంలో భాగంగా.. అవకతవకలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని సీబీఐని కోరడం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదని వివరించింది. హైకోర్టు తీర్పుల నేపథ్యంలో భవిష్యత్తు పరిణామాలపై జోరుగా చర్చలు సాగుతున్నాయి. జగన్‌పై క్రిమినల్ కేసు నమోదుకు సీబీఐ అన్ని ఆధారాలను సేకరించిన నేపథ్యంలో.. తొలి చార్జిషీటును దాఖలు చేయడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చని, ఆ తర్వాత ఏ క్షణంలోనైనా జగన్‌ను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఈ కేసులో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని, వాటిపై తాము సంతృప్తి చెందుతున్నామని ఇప్పటికే ధర్మాసనం వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఇక, కోర్టు తీర్పు నేపథ్యంలో.. వైఎస్ హయాంలో అడ్డగోలుగా వ్యవహరించిన ఐఏఎస్‌ల నుంచి అమాత్యుల వరకు కష్టాలు తప్పవని భావిస్తున్నారు. అప్పటి ప్రభుత్వ సలహాదారుడు కేవీపీ రామచంద్రరావు, ఆయన కుటుంబ సభ్యులు, అప్పటి మంత్రివర్గంలోని కొంతమంది మంత్రులను కూడా సీబీఐ విచారించనుందని, ఏపీఐఐసీ మాజీ ఎండీ బీపీ ఆచార్య సహా అప్పట్లో కీలక శాఖలు నిర్వర్తించిన అధికారులకూ ఉచ్చు తప్పదని న్యాయకోవిదులు అభిప్రాయపడుతున్నారు. ఇక, కోర్టు తీర్పుపై వివిధ రాజకీయ పక్షాల నేతలు హర్షం వ్యక్తం చేయగా.. దేవుడనేవాడు ఉన్నాడని, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని జగన్ వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment