Wednesday 10 August 2011

జగన్‌పై క్రిమినల్ కేసు దాఖలుకు హై కోర్టు ఆదేశాలు అక్రమ ఆస్తులపై ప్రాథమిక సాక్ష్యాలు పూర్తి స్థాయి దర్యాప్తునకు సి.బి.ఐ.కి హై కోర్టు ఆదేశం ఎమార్ అక్రమాలపై కూడా ఇవే ఆదేశాలు ఎర్రన్నాయుడు, శంకర్రావుల అఫిడవిట్‌లే చాలన్న కోర్టు


జగన్‌పై క్రిమినల్ కేసు దాఖలుకు హై కోర్టు ఆదేశాలు
అక్రమ ఆస్తులపై ప్రాథమిక సాక్ష్యాలు
పూర్తి స్థాయి దర్యాప్తునకు సి.బి.ఐ.కి హై కోర్టు ఆదేశం
ఎమార్ అక్రమాలపై కూడా ఇవే ఆదేశాలు
ఎర్రన్నాయుడు, శంకర్రావుల అఫిడవిట్‌లే చాలన్న కోర్టు

హైదరాబాద్, ఆగస్టు 10 : జగన్ అక్రమ ఆస్తులపై పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలని హై కోర్టు ఆదేశించింది. జగన్‌పై క్రిమినల్ కేసులు దాఖలు చేయాలని కూడా హై కోర్టు ఆదేశించింది. అందరూ ఉత్కంఠతో ఎదురుచూస్తున్న సమయాన హై కోర్టు ఈ తీర్పును బుధవారంనాడు ప్రకటించింది. జగన్‌పై వస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయ ఉద్దేశాలతో వస్తున్న ఆరోపణలుగా భావించలేమని హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి కుక్రు స్పష్టం చేశారు. ఎమార్ అనేక అక్రమాలకు పాల్పడిందన్న విషయాన్ని కూడా కోర్టు స్పష్టంగా పేర్కొన్నది.

ఇదొక ఆర్థిక మాయాజాలంగా కనిపిస్తున్నదని హై కోర్టు జగన్ కంపెనీలపై వ్యాఖ్యానించింది. కార్పొరేట్ ముసుగులో కొన్ని అదృశ్య శక్తులు జగన్ కంపెనీలలో పెట్టుబడులు పెట్టాయని, అవి ప్రయోజనాలు పొందాయనడానికి ఆధారాలు కనిపిస్తున్నాయని అభిప్రాయపడుతూ లెక్కలు చూపని వ్యవహారాలు ఇందులో చాలా ఉన్నాయని కోర్టు పేర్కొన్నది. పన్నుల కట్టనక్కరలేని దేశాలనుంచి అక్రమ మార్గాలలో పెట్టుబడులు వచ్చాయని కోర్టు పేర్కొన్నది. ఇందులో కుట్ర దాగి ఉన్నట్టు కనిపిస్తున్నదని కూడా కోర్టు పేర్కొన్నది.

జగన్ అక్రమాలపై ప్రత్యేకంగా సి.బి.ఐ. నివేదికను సైతం చూడనక్కరలేదని, తమ దృష్టికి వచ్చిన అఫిడవిట్స్‌పై ఆధారపడే ఈ ఆదేశాలు ఇస్తున్నట్టు కోర్టు పేర్కొన్నది. మనీ లాండరింగ్, అవినీతి నిరోధక చట్టాల క్రింద జగన్‌పై దర్యాప్తునకు రంగం సిద్ధమైంది. జగన్ కంపెనీలలో పెట్టుబడి పెట్టినవారు కేవలం వాణిజ్య కోణంలో మాత్రమే పెట్టుబడులు పెట్టారని కూడా కోర్టు భావించలేకపోయింది.

జగన్ ఎలా అక్రమాలకు పాల్పడిందీ పూర్తి దర్యాప్తు జరపాలని కోర్టు ఆదేశించింది. జగన్ కంపెనీలలో గల పెట్టుబడుల దేశ, విదేశీ మూలాల గురించి పూర్తి వివరాలు ప్రజలకు తెలియజేయవలసి ఉందని కోర్టు భావించింది. జగతి పబ్లికేషన్స్, భారతి సిమెంట్స్ కంపెనీలలో పెట్టుబడులు ఎలా వచ్చాయో తేలాలని కోర్టు పేర్కొన్నది. ఎర్రన్నాయుడు, శంకర్రావు పిటిషన్‌లనే కోర్టు పరిగణనలోకి తీసుకుంది. జగన్, ఎమార్ అక్రమాలపై మొట్టమొదట ఆంధ్ర జ్యోతి వివిధ కథనాలను వెలుగులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.

ఎమార్ ప్రాపర్టీస్‌పై కూడా కోర్టు ఆదేశాలు
ఎమార్ ప్రాపర్టీస్ అనేక అక్రమాలకు పాల్పడినట్టు ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నాయని హై కోర్టు ప్రకటించింది. ఎమార్ అక్రమాలపై పూర్తి స్థాయి సమగ్ర విచారణ జరపాలని సి.బి.ఐ.కి హై కోర్టు బుధవారంనాడు ఆదేశాలు జారీ చేసింది. ఎమార్ కంపెనీపై క్రిమినల్ కేసు దాఖలు చేయాలని కూడా కోర్టు ఆదేశించింది. ఎమార్ వ్యవహారాల దరిమిలా రాష్ట్ర ప్రభుత్వం భూముల పరిరక్షణ విషయంలో ఎటువంటి చర్యలూ తీసుకోలేదని కూడా కోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. ఎమార్ వ్యవహారంలో దాదాపు 4500 కోట్ల రూపాయల ప్రజా ధనం కొల్లగొట్టబడినాయని హై కోర్టు భావించింది. ఇంత జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క ఎఫ్.ఐ.ఆర్. దాఖలు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ప్రభుత్వ భూముల పరిరక్షణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, ఎ.పి.ఐ.ఐ.సి. పూర్తిగా విఫలమయ్యాయని కోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా గాక ఒక ప్రయివేటు సంస్థకు మేలు చేకూర్చే విధంగా వ్యవహరించారని కోర్టు తీవ్రంగా విమర్శించింది. భూములను ఒక ప్రయివేటు కంపెనీ తన ఇష్టం వచ్చినట్టు తన్నుకుపోతుంటే ప్రభుత్వం మిన్నకుండడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది.

ఎమార్ వ్యవహారంలో బి.పి.ఆచార్య వంటి అధికారులను సి.బి.ఐ. విచారించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారాలలో అధికారులపైన కూడా దర్యాప్తు చేపట్టాలని కోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారాలలో ఎంతో ప్రజా ధనం వృథా అయ్యిందని కోర్టు పేర్కొన్నది. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నదని కోర్టు విమర్శించింది.

No comments:

Post a Comment